Type Anything.., You Get World Wide Search Results Here. !

ఉమోజా దేశం : ఆడవాళ్లకు మాత్రమే

ఉమోజా: ఆడవాళ్లకు మాత్రమే

కెన్యాలోని ఉమోజా అనే గ్రామంలో మగాళ్లకు చోటులేదు. కేవలం ఆడవాళ్లకే సొంతమైన ప్రదేశమది. రెబెకా లొలొసోలీ అనే ఆవిడ పాతికేళ్ల క్రితం ఈ గ్రామాన్ని స్థాపించింది. సాంబురు తెగలకు చెందిన స్త్రీలు, ఆడపిల్లల్ని గృహహింస, పురుషాధిక్యత నుంచి కాపాడేందుకే ఇది. స్త్రీలను హింసించే ఆచారాలు, పద్ధతులు ఎక్కువగా ఉన్న పురుషాధిక్య తెగ సాంబురు. చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాల్ని, అవమానాల్ని ఎదుర్కున్న రెబెకా మిగతా ఆడవారి రక్షణ కోసం దీన్ని నెలకొల్పారు. అనాథలు, పీడితులు, విధవలు, బలవంతపు పెళ్లిళ్లకు బలైన మహిళలకు ఇక్కడ ఆశ్రయమిస్తారు.

 1990 ప్రాంతంలో తన సొంత గ్రామంలో ఓ మహిళను దగ్గరలోని క్యాంపునకు చెందిన బ్రిటిష్‌ సైనికులు అత్యాచారం చేశారు. దానికి నిరసనగా రెబెకా గళమెత్తితే గ్రామానికి చెందిన పురుషులే తీవ్రంగా కొట్టారు. ఇంత అరాచకం చేస్తున్నా భర్త కూడా మౌనం వహించాడు. 50 ఏళ్లుగా క్యాంపు సైనికుల అత్యాచారాలకు లెక్కేలేదు. మగాళ్లు దీనిపై ఎదురు తిరగక పోగా ఆడవారితో తెగతెంపులు చేసుకునేవాళ్లు. ఈ కిరాతకాలను సహించలేక ఆమె ఉద్యమాన్ని లేవదీసింది. 

మిగతా బాధితుల్ని ఏకం చేసి గ్రామాన్ని బహిష్కరించి వెళ్లిపోయి ఉమోజా గ్రామాన్ని నెలకొల్పింది. అలా మహిళల కోసమే ఏర్పడిన ఆ గ్రామం బాగా అభివృద్ధి చెందింది. కడుపున పుట్టిన బిడ్డలను అక్కున చేర్చుకుని ఆలనాపాలనా ఇక్కడే చూసుకుంటున్నారు ఉమోజా మహిళలు. సాంప్రాదాయక ఆభరణాలు, పర్యాటకం ద్వారా సాధికారత సాధించారు. స్థానిక పురుష ఎంపీకి ఉమోజా గ్రామానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ ఉందనే విషయం కూడా తెలియదు. అసలదేంటో అన్న విషయం అయినా తెలుసోలేదో అని రెబెకా వ్యంగ్య బాణాన్ని నవ్వుతూ వదిలింది.

Top

Bottom